ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి బసవరాజ్ బొమ్మై 'విద్యా సంస్థల్లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించకూడదు' అని విధించిన నిషేధమే. ఈ నిర్ణయంపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పలు పార్టీలు కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
అయితే, 'హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కాదు. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం తీసుకువచ్చిన హిజాబ్ నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది, విద్యా సంస్థలు తమ విద్యార్థులందరికీ డ్రెస్ కోడ్ను నిర్ణయించవచ్చని పేర్కొంది. ఇలాంటి తీర్పు వెలువడిన ఏడాది తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
నిన్న మైసూరులో జరిగిన ఓ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 'మీకు నచ్చిన దుస్తులు ధరించండి. నాకు నచ్చినవి నేను వేసుకుంటాను. మీకు నచినవి తినండి, నాకు నచ్చినవి నేను తింటాను. నేను పంచ కట్టుకున్నాను అదేవిధంగా మీరు ప్యాంట్లు, షర్టులు వేసుకోండి అందులో తప్పేముంది..? ఇక హిజాబ్ పై నిషేధం లేదు. మహిళలు హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లొచ్చు.. దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశించాను.. ఏం ధరించాలి, ఏం తినాలి అనేది మీ ఇష్టం. నిన్ను నేనెందుకు ఆపాలి?" అని అన్నారు.