Jani Master joins Jana Sena Party.
Jani Master joins Jana Sena Party.

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు!

బుధవారం (జనవరి 24) మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు.
Published on

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి మొదలయింది. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ MLA , ఎంపీల అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు.. పలు కీలక నేతల ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి షిఫ్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే.. వైసీపీలో టికెట్ దక్కని కొందరు కీలక నేతలు.. టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. అదే సమయంలో.. టీడీపీలోని నాయకులు కూడా జగన్ పార్టీ లోకి చేరిపోతున్నారు. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు ప్రముఖులు పాలిటిక్స్ వైపు దిగాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ జనసేనలో చేరారు. బుధవారం రోజున మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జానీ మాస్టర్‌ కు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానించారు.

టాలీవుడ్‌లో స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్‌ కూడా ఒకరు. 2009 ద్రోణ సినిమాతో డ్యాన్స్‌మాస్టర్‌గా అడుగుపెట్టారు జానీ మాస్టర్‌. స్టైలిష్ స్టార్ తో జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, అలా వైకుంఠ పురంలో ఇక రామ్‌ చరణ్‌ తో రచ్చ, నాయక్‌, ఎవడు, రంగస్థలం, యంగ్‌ టైగర్‌తో ఎన్టీఆర్‌ తో బాద్షా, టెంపర్‌, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత వీర రాఘవ, రామ్‌ పోతినేనితో ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి హిట్‌ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. తమిళంలో విజయ్‌ తో బీస్ట్, వారసుడు సినిమాలకి, కన్నడలో సుదీప్‌ వంటి స్టార్‌ హీరోలతో పనిచేసిన ఆయన బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ తదితర స్టార్‌ హీరోలతోనూ వర్క్‌ చేశారు.

పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకునే జానీ మాస్టర్.. దానధర్మాల్లోనూ పవర్ స్టార్‌నే ఫాలో అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. అంగన్వాడీల నిరసనలో ప్రాణాలు కోల్పోయిన ఓ అంగన్వాడీ కార్యకర్త కుటుంబాన్ని కలిసి ఆర్థిక సాయం సైతం అందజేశారు. దీంతో జానీ మాస్టర్ రాజకీయాల్లోకి వస్తున్నారని...అది కూడా జనసేనలోనే చేరనున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ...ఈ రోజు (జనవరి 24) తానెంతో అభిమానించే పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీలో చేరారు. అయితే జానీ మాస్టర్ జనసేన నుంచి నెల్లూరు జిల్లాలో ఏదో ఒకస్థానం నుంచి బరిలో దిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జానీ మాస్టర్‌ పోటీ చేసే అవకాశముందని కూడా వార్తలు వస్తున్నాయి.

Vikatan Telugu
telugu.vikatan.com