North - East ఢిల్లీలోని పింక్ లైన్ లో ఉన్న గోకుల్ పురి మెట్రో స్టేషన్ లో ఒక భాగం గురువారం కుప్పకూలింది.
ఉదయం 11 గంటల సమయంలో ఎలివేటెడ్ ప్లాట్ ఫాంకు తూర్పు వైపున ఉన్న ప్రహరీ గోడలోని కొంత భాగంతో పాటు స్లాబ్ లోని కొంత భాగం కింద రోడ్డుపై పడటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
సమీపంలోని కరవాల్ నగర్ ప్రాంతంలోని షహీద్ భగత్ సింగ్ కాలనీకి చెందిన వినోద్ కుమార్ (53) స్కూటర్ పై వెళ్తుండగా కూలిన గోడ శిథిలాలు అతనిపై పడటంతో మృతి చెందారు ఇక పలువురు గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా, ప్రస్తుతం దిల్షాద్ గార్డెన్లోని GTB ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో రెండు మోటార్ సైకిళ్లు, రెండు స్కూటర్లు ధ్వంసమయ్యాయి.
కూలిన తర్వాత స్లాబ్ లోని ఒక భాగం ప్రమాదకరంగా వేలాడుతూ ఉండడంతో అధికారులు వేగంగా స్పందించారు. గోకుల్ పురి పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే బాధితులను రక్షించి GTB ఆస్పత్రికి తరలించారు.
ముందుజాగ్రత్త చర్యగా మరమ్మతు పనులు ప్రారంభించే ముందు నిపుణుల బృందం తనిఖీ చేసే వరకు మెట్రో స్టేషన్ ను తాత్కాలికంగా మూసివేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని అధికారులు ప్రకటించారు.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఈ క్లిష్ట సమయంలో సహాయ సహకారాలు అందించేందుకు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.1-5 లక్షల పరిహారం ప్రకటించింది.