అయోధ్యలో రామ మందిరం ఐదు శతాబ్దాల కల నేడు సాకారమయ్యింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ, RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, గాడ్ అఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, కంగనా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, రణబీర్ కపూర్, అలియా భట్ మరియు అభిషేక్ బచ్చన్ తదితరులు ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి హాజరయ్యారు.
బాలరాముడికి కు పసుపు రంగు పట్టు వస్త్రాలు, పాదుకలు, ఛత్రం సమర్పించి అతనిని పువ్వుల మాలతో అలంకరించారు. సరిగ్గా మధ్యాహ్నం 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. 84 సెకన్లపాటు ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. వైదిక మంత్రాల మధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు. బాలరాముడైన రామ్ లల్లా కు ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచమంతా రామనామస్మరణ జరుగుతుండగా ఈ కార్యక్రమం జరిగింది. విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు, అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో భారత వైమానిక దళం హెలికాప్టర్‌లు పూలవర్షం కురిపిస్తూ కనిపించాయి. రామ్ లల్లా విగ్రహాన్ని ప్రపంచానికి ఆవిష్కరించడంతో ప్రాణప్రతిష్ట ఆచార వ్యవహారాలు ముగిశాయి.