గత ఏడాది చివర్లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక అంశంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహా పలువురి పేర్లు తెరపైకి రాగా, బీజేపీ అనూహ్యంగా భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా నియమించింది. వీటన్నింటి తర్వాత భజన్ లాల్ శర్మ ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 22 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
వీరిలో 12 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 12 మంది క్యాబినెట్ మంత్రుల్లో బాబు లాల్ ఖరాడీ ఒకరు. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి అయిన బాబూ లాల్ ఖరాడీ బహిరంగ సభలో 'చాలా మంది పిల్లలకు జన్మనివ్వండి, మోదీ మీకు ఇల్లు కట్టిస్తారు' అని అన్నారు.
మంగళవారం ఉదయ్ పూర్ లో జరిగిన విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర శిబిరం బహిరంగ సభ వేదికపై మంత్రి బాబూ లాల్ ఖరాడీ మాట్లాడుతూ...తలపై పైకప్పు లేకుండా(ఉండడానికి చోటు లేకుండా) ఎవ్వరూ ఆకలితో నిద్రపోకూడదనేది ప్రధాని కల అని అన్నారు. మీరు చాలా మంది పిల్లలకు జన్మనివ్వండి. మోడీ మీకు ఇల్లు కట్టిస్తారు. ఇకమీదట ఇంకేం సమస్య ఉంటుంది...అని ఆయన అన్నారు.
మంత్రి మాటలు విన్న తర్వాత వేదికపై ఉన్నవారు మరియు ఆ సభలో ఉన్న ఇతరులు నవ్వు ఆపుకోలేకపోయారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం రూ.200 తగ్గించిందని, రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం ఉజ్వల పథకం కింద సిలిండర్లను రూ.450లకు అందిస్తోందని మంత్రి బాబూ లాల్ ఖరాడీ తెలిపారు.
ఈ విధంగా మాట్లాడిన మంత్రి బాబు లాల్ ఖరాడీకి ఇద్దరు భార్యలు, ఎనిమిది మంది పిల్లలు ఉండటం గమనార్హం.